ఏపీలో లిక్కర్ కేసులో (ఏ4) నిందితుడు, వైసీపీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. అరెస్టు చేయకుండా ఛార్జిషీట్ ఎలా దాఖలు చేశారని జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మహదేవన్‌ల ధర్మాసనం సిట్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ముందస్తు బెయిల్ పొందడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం అడిగింది. విచారణ అనంతరం ముందస్తు బెయిల్ కోసం మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. లొంగిపోవడానికి సమయమిచ్చేందుకు కూడా సుప్రీంకోర్టు విముఖత చూపింది. మద్యం కేసులో ముందస్తు బెయిలు కోసం మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల ఏపీ హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మద్యం కుంభకోణం కేసులో మిథున్‌రెడ్డిపై సిట్ అధికారులు ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో.. విదేశాలకు పారిపోకుండా అడ్డుకునేందుకు ఈ ఎల్వోసీ ఇచ్చారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసే అవకాశముందని ముందే గ్రహించిన మిథున్‌రెడ్డి అప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ దాక్కున్నారో తెలుసుకునేందుకు సిట్ బృందాలను ఏర్పాటు చేసింది. మద్యం కుంభకోణం కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత మిథున్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోవటం ఇది రెండోసారి. ఈ కుంభకోణంలో తన ప్రమేయం సిట్ దర్యాప్తులో బయటపడిందని తెలియగానే మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోసం మార్చిలో హైకోర్టుకు వెళ్లారు. అప్పటికి ఆయన్ను ఈ కేసులో నిందితుడిగా చేర్చకపోవడంతో కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. తనను అరెస్టు చేస్తారేమోననే భయంతో మిథున్‌రెడ్డి అప్పట్లో అజ్ఞాతంలో ఉంటూనే.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టులో విచారణ కొనసాగినంత కాలం అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలివ్వటంతో బయటకొచ్చారు. ఇప్పుడు మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మిథున్‌రెడ్డి ఆచూకీ తెలిస్తే.. ఆయన్ను సిట్ అధికారులు వెంటనే అరెస్టు చేసే అవకాశముంది.